ఇలాంటి కథ చేయడం నా అదృష్టం

  • నా తొలి సినిమా ‘ఎస్‌ఎంఎస్‌’ విడుదలకు వారం ముందు ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమాకి సంతకం చేశా. అవసరాల శ్రీనివాస్‌ కథ అందిస్తాన్నారు. కానీ, సినిమా పట్టాలు ఎక్కలేదు. తర్వాత అదే కథకు మార్పులు చేసి, ‘ఊహలు గుసగుసలాడే’ తీశారు. ఇప్పటికి ఇంద్రగంటితో సినిమా చేయడం కుదిరింది. నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఇంద్రగంటి సెట్‌లో నటుడే రారాజు. నటీనటుల మూడ్‌ని బట్టి ఆయన సన్నివేశాలు తీస్తారు. అంతేకానీ… కెమెరా, లైటింగ్‌ చెక్‌ చేసుకొని తీయరు. దాంతో సన్నివేశాలు బాగా వస్తాయి. భాష విషయంలోనూ ఆయన చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. సుమారు 25 రోజులు ఈ సినిమాకి డబ్బింగ్‌ చెప్పా. ఇంద్రగంటితో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను రెడీ. ఈ సినిమాలో దర్శకులు హరీశ్‌ శంకర్‌, అవసరాల శ్రీనివాస్‌, తరుణ్‌ భాస్కర్‌ అతిథి పాత్రలు చేశారు.
  •  మా నాన్నగారికి చాలా వ్యాపారాలున్నాయి. వాటి బాధ్యతలను నేను చూసుకుంటానంటే ఆయన కాదనరు. కానీ, నేను చేపట్టలేదు. నాకంటూ సొంతంగా ఏదైనా సాధించాలనే ఆలోచనతో చిత్రపరిశ్రమకి వచ్చాను. సంతృప్తి కోసమే నాకిష్టమైన నటనను వృత్తిగా ఎంచుకున్నా. ఇక్కడా నావాళ్ళు కృష్ణ, మహేశ్‌ పేర్లు చెప్పుకొని అవకాశాలు పొందితే గౌరవం ఉండదు. సొంతంగా నాకు నేనుగా ఎదగాలనుకుంటున్నా. అందుకని, అవకాశాల పరంగా మహేశ్‌బాబు సహాయాన్ని ఎప్పుడూ కోరలేదు. అది దృష్టిలో పెట్టుకొని ప్రీ-రిలీజ్‌లో మహేశ్‌ అలా మాట్లాడారు. సినిమాల్లో సపోర్ట్‌ అడిగితే మళ్లీ కట్నం అడిగినట్టే.
  •  నేను హీరోగా నటిస్తూ, నా సంస్థ ఎస్‌బి ప్రొడక్షన్‌లో నిర్మిస్తున్న సినిమా 70శాతం సిద్ధమైంది. దీంతో విరించి వర్మ శిష్యుడు ఆర్‌.ఎస్‌. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెండు నెలల తర్వాత సినిమాను విడుదల చేస్తాం. ఆ తర్వాత ‘వీరభోగ వసంతరాయులు’ విడుదలవుతుంది.
  •  మంచి కథ లభిస్తే.. మహేశ్‌బాబు హీరోగా ఎస్‌బి ప్రొడక్షన్‌లో సినిమా నిర్మిస్తా. అదీ ఇంద్రగంటి దర్శకత్వంలో అయితే బావుంటుంది. ఆయనపై మహేశ్‌కీ మంచి నమ్మకం ఉంది.
  •  ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో హీరోగా నటించనున్న బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ చిత్రీకరణ సెప్టెంబర్‌లో మొదలవుతుంది. గోపీచంద్‌ బాడీ లాంగ్వేజ్‌తో పాటు అతని మనసు తెలుసుకోవడం కోసం కొన్నిరోజులు ఆయనతో ట్రావెల్‌ చేయాలనుకుంటున్నా. అలాగే, నేను ఒకప్పుడు బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌. ఇప్పుడు మళ్ళీ బాగా ప్రాక్టీస్‌ చేసి కొన్ని ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్స్‌ ఆడితే… చిత్రీకరించి సినిమాలో ఉపయోగించాలనే ప్లాన్‌ చేస్తున్నారు. అలా అయితే సన్నివేశాలు సహజంగా ఉంటాయని దర్శక-నిర్మాతల ఆలోచన. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.