ఇంటర్వ్యూ : సునీల్ రెడ్డి – గల్ఫ్ బాధితుల కష్టాల్ని చెప్పాలనే ఈ సినిమా తీశాను !

ఈ నెల 13న సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమా చేయడం ఎలా అనిపిస్తోంది

ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే ఈ ‘గల్ఫ్’ చిత్రం మరొక ఎత్తు. ఇది నా గుండెకు బాగా దగ్గరైన చిత్రం. రెండున్నరేళ్లు కష్టపడి ఈ సినిమా తీశాం.

రెండున్నరేళ్ళు అంటే ఎక్కువ సమయమే పట్టునట్టుంది

అవును. సబ్జెక్ట్ అలాంటిది. సినిమా కోసం చాల రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. అందుకే ఎక్కువ టీమ్ పట్టింది.

అసలు ఈ అంశం మీద సినిమా చేయాలని ఎందుకనిపించింది

అమెరికా వలసల మీద చాల సినిమాలోచ్చాయి. గల్ఫ్ వలసలు మీద పూర్తి స్థాయి సినిమాలు రాలేదు. తెలుగులో అయితే అస్సలు రాలేదు. అందుకే ఆ సున్నితమైన అంశం మీద సినిమా చేద్దామనుకుని చేశాను.

ఈ సినిమా చేయడం వెనుక మీ లక్ష్యం

మన తెలుగు రాష్ట్రాల నుండే గల్ఫ్ కు ఎక్కువ మంది వలస వెళుతుంటారు. అక్కడ కష్టాలు పడే వారిలో కూడా 95 శాతం మంది తెలుగువాళ్ళే. వాళ్లలో హింసకు గురయ్యే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వారి పట్ల ప్రభుత్వాలు కాస్త ఎక్కువగా స్పందించాలి. కానీ అలా జరగడంలేదు. ప్రభుత్వంలో, నాయకుల్లో ఆ స్పందన తీసుకురావడం కోసమే ఈ సినిమా చేశాను.

మీ రీసెర్చ్ లో మీరు తెలుసుకున్న నిజాలేమిటి

గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా పనిచేస్తుంది తెలుగువాళ్లే. అక్కడి స్థానికులు చేసే మోసం కన్నా మన వాళ్ళని మన వాళ్లే మోసం చేయడం ఎక్కువ. ఎంతో మంది కొన్నేళ్ళ పాటు కుటుంబాల్ని వదిలి అక్కడే కష్టపడుతున్నారు. ఏటా మన తెలుగు రాష్ట్రాలకు వాళ్ళ ద్వారా 30,000 కోట్ల రూపాయలు వస్తోంది. అలాంటి వారిని గురించి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

 

రిలీజ్ ఏ స్థాయిలో ఉండబోతోంది

ఇండస్ట్రీలో, డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ లో నాకున్న పరిచయాలతో రిలీజ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాను. సినిమా సుమారు 250 నుండి 300 స్క్రీన్లలో రిలీజ్ కానుంది.

మీ తదుపరి ప్రాజెక్ట్స్ ఏంటి

ఇదివరకు నేను చేసిన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ క్రైమ్ కథ’ సినిమాలకు మూడవ భాగంగా రొమాంటిక్ క్రిమినల్స్ అనే సినిమా చేస్తున్నాను. అది కూడా త్వరలోనే ఉండనుంది.