భరత్ అనే నేను మూవీ రివ్యూ

టైటిల్ : భరత్‌ అనే నేను
జానర్ : కమర్షియల్‌ డ్రామా
తారాగణం : మహేష్‌ బాబు, కైరా అద్వానీ, ప్రకాశ్‌ రాజ్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మాజీ, రావు రమేష్‌ తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌
స్టోరీ-డైలాగులు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : కొరటాల శివ
నిర్మాత : డీవీవీ దానయ్య

సినిమిర్చి.కామ్ రేటింగ్ 3.5/5

కథ:
భరత్‌ రామ్‌(మహేష్‌ బాబు)కు కొత్త విషయాలను నేర్చుకోవటమంటే చాలా ఇష్టం. అందుకే లండన్‌ ఆక్స్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో డిగ్రీలు చేస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో తండ్రి రాఘవ(శరత్‌ కుమార్‌) మరణం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నవోవయం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎదిగిన రాఘవ మృతితో పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు రాజకీయ గురువు వరద(ప్రకాశ్‌ రాజ్‌) భరత్‌ను సీఎంను చేస్తాడు. అదుపు తప్పిన ప్రజా జీవితాన్ని భరత్‌ తన మొండి నిర్ణయాలతో గాడిన పెట్టే యత్నం చేస్తుంటాడు. భరత్‌ దూకుడు స్వభావం రాజకీయ వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడి కుమారుడి కేసులో భరత్‌కు తొలి ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రజల నుంచి భరత్‌కు మద్ధతు పెరుగుతున్నా.. సొంత పార్టీ నుంచే మాత్రం ప్రతిఘటన ఎదురవుతుంటుంది. ఈ పోరాటంలో భరత్‌ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..? వాటన్నింటిని అధిగమించి భరత్‌ తన ప్రామిస్‌లను ఎలా పూర్తి చేస్తాడు? అన్నదే కథ.

నటీనటులు
భరత్‌ రామ్‌గా మహేష్‌ బాబు నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన కథను పూర్తిగా తన భుజాల మీదే నడిపించాడు. ముఖ్యమంత్రి పాత్రకు కావాల్సిన హుందాతనం చూపిస్తూనే, స్టైలిష్‌గా రొమాంటిక్‌గానూ ఆకట్టుకున్నాడు. తన కెరీర్‌లో మహేష్‌ క్లాస్‌ రోల్స్‌ చేసినప్పటికీ.. వాటిలో ఏదో వెలితిగా అనిపించేది. కానీ, భరత్‌గా ఓ ఛాలెంజింగ్‌ రోల్‌లో మహేష్‌ పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాడు. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ చీఫ్‌ మినిస్టర్‌ పాత్రలో పర్ఫెక్ట్‌ గా ఒదిగిపోయాడు. తన కెరీర్‌ బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కూడా సూపర్‌ స్టార్‌ అభిమానులను అలరిస్తాయి.

ఇక గాడ్‌ ఫాదర్‌ పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌ మెప్పించాడు. ఇలాంటి పాత్రలను తాను తప్ప మరెవరూ పోషించలేనన్న రీతిలో ఆయన నటించాడు. హీరోయిన్‌ గా పరిచయం అయిన కైరా అద్వానీది చిన్న పాత్రే.. అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. అందంతో పాటు అభినయంలోనూ మంచి మార్కులు సాధించింది. సీఎం భరత్‌ పర్సనల్‌ సెక్రటరీగా బ్రహ్మజీ.. పోసాని కామెడీ ట్రాక్‌లు ఆకట్టుకున్నాయి. శరత్‌ కుమార్‌, ఆమని, సితార, అజయ్‌, రావు రమేష్‌, దేవరాజ్‌, తమ పాత్రల మేర అలరించారు.

ఫ్లస్‌ పాయింట్లు :
మహేష్‌ బాబు
కథా-కథనం
పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌
సమకాలీన రాజకీయాంశాలను సమతుల్యంగా చూపించటం.

మైనస్‌ పాయింట్లు:

స్లో నెరేషన్‌
సాగదీత సన్నివేశాలు
క్లైమాక్స్‌

విశ్లేషణ
హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్లతో జోరు మీదున్న కొరటాల.. మహేష్‌తో చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. సమకాలీన రాజకీయ అంశాలు.. వాటికి తగ్గట్లు కమర్షియల్‌ అంశాలను జోడించి ప్రేక్షకులను ఎంగేజ్‌ చేశాడు. రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి ఏకంగా సీఎం అయిపోవటం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఇబ్బంది పెట్టడం, అసెంబ్లీలో సరదాగా సాగిపోయే సన్నివేశాలు… ఫస్టాఫ్‌ను ఎంటర్‌టైనింగ్‌గా మలిస్తే, దుర్గా మహల్‌ ఫైట్‌.. సామాజిక సందేశం, హీరోయిజం ఎలివేట్‌ అయ్యే సన్నివేశాలు… ఇవన్నీ సెకండాఫ్‌ను నిలబెట్టాయి. పది నిమిషాల్లో అసలు కథలోకి ఎంటర్‌ అయిన దర్శకుడు తరువాత కథనాన్ని నెమ్మదిగా నడిపించాడు. అయితే కొరటాల మార్క్‌ డైలాగ్స్‌, మహేష్ ప్రజెన్స్‌ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తాయి. సీఎం స్థాయి వ్యక్తి రోడ్డు మీద అమ్మాయిని చూసి ప్రేమించటం లాంటి విషయాల్లో కాస్త ఎక్కువగానే సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కొరటాల గత చిత్రాల్లో కనిపించిన వీక్‌నెస్‌ ఈ సినిమాలో కూడా కొనసాగింది. క్లైమాక్స్‌ అభిమానులు ఆశించిన స్థాయిలో లేదు. భరత్‌ సీఎంగా రాజీనామా-తిరిగి పగ్గాలు చేపట్టడం లాంటి సన్నివేశాల్లో దర్శకుడు నాటకీయత ఎక్కువగా జోడించాడు.

ఇక టెక్నీకల్‌ టీమ్‌ మంచి తోడ్పాటును అందించింది. సినిమాటోగ్రఫర్‌ రవి కే చంద్రన్‌, తిర్రు టాప్‌ క్లాస్‌ పనితనాన్ని అందించారు. ముఖ్యంగా పాటలు, యాక్షన్స్‌ సీన్స్‌ పిక్చరైజేషన్స్‌ వావ్‌ అనిపిస్తుంది. దేవీ పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో మెప్పించాడు. ముఖ్యంగా ఒక్కో పాత్రకు ఒక్కో సిగ్నేచర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో పాత్రలను మరింతగా ఎలివేట్‌ చేశాడు శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. భరత్‌ పాత్ర.. దానిలో మహేష్‌ కనబరిచిన నటన.. కొరటాల అందిచిన డైలాగులు ఇలా అన్ని హంగులు అన్ని వర్గాల ప్రేక్షలను అలరించేవిగా ఉన్నాయి.

చివరి మాట : మహేష్ ఫాన్స్ కి పండగ