కథ బలాన్ని నమ్మి చేయాలి ఈ టైం లో ..

2006లో ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చాను. ‘నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్, నేనులోకల్, సినిమా చూపిస్త మావ’ వంటివిజయవంతమైన చిత్రాలు నిర్మించా. నిర్మాతగా 12ఏళ్లలో పది సినిమాలు నిర్మించా. ఈ జర్నీ ఇలాగే కొనసాగుతుంది’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్‌. ఈరోజు(శుక్రవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. అయితే.. ఏదో ఒక కథతో సినిమా చేసేయాలని కాకుండా కథను నమ్మి సినిమాలు చేస్తున్నా. ప్రస్తుతం హర్ష కొనగంటిని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘హుషారు’ సినిమా చేస్తున్నా. నాలుగు రోజులు చిత్రీకరణ మినహా సినిమా పూర్తయ్యింది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. నలుగురు కుర్రాళ్ల కథ. రాహుల్‌ రామకృష్ణ మినహా ముగ్గురూ కొత్తవారే. ఈ సినిమా తర్వాత ఓ కొత్త దర్శకుడితో ‘దిల్‌’ రాజుగారితో కలిసి ఓ ఫ్యామిలీ హీరోను పరిచయం చేయబోతున్నా. జూన్‌లో మొదలవుతుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా, వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తా’’ అన్నారు.