
రివ్యూ: బ్రో
తారాగణం: పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్, కేతికశర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు
స్క్రీన్‌ప్లే, మాటలు: త్రివిక్రమ్
సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్
సంగీతం: తమన్
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
రచన-దర్శకత్వం: పి.సముద్రఖని
సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వినోదాయ సిత్తం’ చక్కటి జీవిత తాత్వికత కలబోసిన కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. తంబి రామయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో దర్శకుడు సముద్రఖని కాలం పాత్రలో కనిపించారు. కాలం ఎవరి కోసమూ ఆగదని, మన ఉనికి లేకున్నా ఈ ప్రపంచం తన పయనాన్ని సాగిస్తుందని, మనిషి తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ నిజాయితీగా బతికితే అదే జీవిత పరమార్థమనే కర్మ సిద్ధాంతాన్ని ఈ సినిమాలో చర్చించారు. మనిషి జీవితానికి సెకండ్ ఛాన్స్ ఉంటే అతను తన తప్పులను ఎలా తెలుసుకున్నాడనే ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాకు రీమేక్‌గా ‘బ్రో’ చిత్రాన్ని తెరకెక్కించారు.
పవన్‌కల్యాణ్,ఆయన మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ప్రధాన పాత్రల్లో నటించడం..ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడంతో ఈ సినిమా నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు రీమేక్ నిర్దేశక బాధ్యతల్ని తీసుకున్నారు. తమిళ మూల కథను అలాగే తీసుకొని తెలుగు నేటివిటీకి, పవన్‌కల్యాణ్ ఇమేజ్‌కు అనుగుణంగా కొన్ని మార్పులతో తెలుగు రీమేక్‌ను తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..
కథ:
మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయిధరమ్‌తేజ్) ఇంటికి పెద్ద కొడుకు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నింటిని భుజాన వేసుకుంటాడు. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదగాలనే తపనతో పాటు తన ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడికి గొప్ప జీవితాన్ని ఇవ్వాలని అనుక్షణం తపిస్తుంటాడు. తను చేయాల్సిన పనులకు ఏమాత్రం టైం సరిపోవడం లేదని బాధపడుతూ ఎప్పుడూ బిజీగా కనిపిస్తుంటాడు. ఓ రోజు ఆఫీసు పని మీద విశాఖపట్నం వెళ్లి హైదరాబాద్ వస్తుండగా కారు ప్రమాదంలో మరణిస్తాడు మార్క్.
అనంతరం అతను ఆత్మరూపంలో టైటాన్ అలియాస్ టైం (పవన్‌కల్యాణ్)ను కలుసుకుంటాడు. తాను జీవితంలో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని, ఇలా అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించడం భావ్యం కాదని కాలం రూపంలో ఉన్న టైటాన్‌ను కోరతాడు మార్క్. దీంతో మార్క్ అనుకున్న పనులు పూర్తి చేయడానికి కాలం అతనికి 90 రోజుల సమయాన్ని ఇస్తుంది. కాలం దయతో రెండో జీవితాన్ని పొందిన మార్క్ తన బాధ్యతలన్నింటిని ఎలా పూర్తి చేశాడు? ఈ క్రమంలో అతను తెలుసుకున్న జీవిత సత్యమేమిటన్నదే మిగతా చిత్ర కథ..
కథా విశ్లేషణ:
తమిళ ‘వినోదాయ సిత్తం’ కేవలం గంటన్నర నిడివిలో సాగే ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా. కానీ తెలుగు వెర్షన్‌లో పవన్‌కల్యాణ్ వంటి అగ్ర హీరో భాగం కావడంతో ఆయన అభిమానులు కోరుకునే వాణిజ్య అంశాలను జోడించి ఈ సినిమాను దాదాపు రెండున్నర గంటలు సాగే ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. తమిళంలో తండ్రి పడే సంఘర్షణను చూపించగా..ఇక్కడ కథాపరంగా కొద్ది మార్పులతో ఇంటికి పెద్ద కొడుకు చుట్టూ కథను నడిపించారు. మూలకథతో పాటు ప్రధాన సన్నివేశాలన్నింటిలో ఎలాంటి మార్పులు లేకుండా ‘బ్రో’ సినిమాను తెరకెక్కించారు.
పవన్‌కల్యాణ్ ఇమేజ్‌ను ఆవిష్కరించే ఎలివేషన్స్, ఆయన పాత సినిమాల్లో హిట్‌సాంగ్స్..కాస్త యాక్షన్ హంగులను ఈ సినిమాకు అదనపు ఆకర్షణలుగా జోడించారు. మొత్తంగా పవన్‌కల్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆయన పాత్రను డిజైన్ చేశారు. పవన్‌కల్యాణ్ ఇమేజ్‌ను డీల్ చేసే విషయంలో మంచి పట్టున్న త్రివిక్రమ్ తనదైన శైలి రచనతో ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. ముఖ్యంగా ఆయన రాసిన సంభాషణలు అంతర్లీనంగా గొప్ప ఫిలాసఫీని చాటుతూ వినోదాన్ని పంచాయి.
ఇక పవన్‌కల్యాణ్ తనదైన మేనరిజమ్స్, పాత పాటలతో తెరపై చేసే హంగామా అభిమానులకు కావాల్సినంత జోష్‌ను పంచుతుంది. పవన్‌కల్యాణ్ కనిపించే ప్రతి సన్నివేశాన్ని అభిమానులను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారనే భావన కలుగుతుంది. ఓ వైపు పవన్‌కల్యాణ్ హీరోయిజాన్ని ఆవిష్కరిస్తూనే ప్రధాన కథలోని భావోద్వేగాలు ఏమాత్రం పక్కదారి పట్టకుండా చక్కటి బ్యాలెన్స్‌తో సినిమాను నడిపించాడు దర్శకుడు సముద్రఖని. ఇక సాయిధరమ్‌తేజ్ పాత్రలో బలమైన సంఘర్షణ కనిపిస్తుంది. అయితే మాతృకతో పోల్చితే ఈ పాత్రను అంత ఎఫెక్టివ్‌గా తెరపై తీసుకురాలేదనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్ మిస్ అయిందనే ఫీల్ కలుగుతుంది.
మార్క్ కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో చక్కటి డ్రామా పండింది. ముఖ్యంగా మార్క్‌ను ఆటపట్టిస్తూ పవన్‌కల్యాణ్ చేసే సందడి సినిమాలో హైలైట్‌గా అనిపిస్తుంది. తమిళ మాతృక మాదిరిగానే ఈ సినిమాలో కూడా క్లెమాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. త్రివిక్రమ్ పదునైన సంభాషణలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఫిలాసఫికల్ డైలాగ్స్‌తో పాటు పవన్‌కల్యాణ్ ప్రస్తుత రాజకీయ ప్రయాణాన్ని స్ఫురించేలా కొన్ని సంభాషణలను జత చేశారు త్రివిక్రమ్. ఈ సంభాషణలు అభిమానులకు బాగా నచ్చుతాయి. అయితే మాతృకతో పోల్చితే ఈ రీమేక్‌లో డైలాగ్స్ డోస్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ప్రథమార్థాన్ని ఆద్యంతం వినోద ప్రధానంగా నడిపించిన దర్శకుడు సముద్రఖని, ద్వితీయార్థంలో భావోద్వేగాలకు పెద్ద పీట వేశాడు. ఏవో కొన్ని లోపాలు మినహా తమిళ మాతృకలోని సారాంశాన్ని ఏమాత్రం మిస్ చేయకుండా ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సముద్రఖని సఫలీకృతుడయ్యారు.
నటీనటుల పర్‌ఫార్మెన్స్:
ఈ కథకు పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ మూలస్తంభాలుగా నిలిచారు. పవన్‌కల్యాణ్ పాత్ర వల్లే ఈ సినిమాకు ఈ స్థాయిలో క్రేజ్ వచ్చింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా పవన్‌కల్యాణ్ తనదైన నటనతో మెప్పించాడు. ఇక సాయిధరమ్‌తేజ్ సెటిల్డ్ ఫర్‌ఫార్మెన్స్ కనబరిచాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇక కథానాయిక కేతికశర్మ పాత్రకు అంత ప్రాధాన్యత దక్కలేదు. ఓ పాటకు, కొన్ని సీన్లకు మాత్రమే పరిమితమైపోయింది.
చెల్లెలి పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఆమె అభినయం బాగుంది. తల్లి పాత్రలో రోహిణి తనదైన నటనతో మెప్పించారు. బ్రహ్మానందం అతిథి పాత్రలో మెరిశారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, అలీరెజా తమ పరిధుల మేరకు నటించారు. కథానుగుణంగా తమన్ నేపథ్య సంగీతం బాగా కుదిరింది. సాంకేతికంగా అన్ని విభాగాల్లో ఉన్నత ప్రమాణాలు కనిపించాయి.
ఇక త్రివిక్రమ్ సంభాషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని డైలాగ్స్ లోతైన భావాలతో హృదయాన్ని తాకుతాయి. మాతృక స్థాయిలో ఎమోషన్స్ పండకపోయినా…జీవితం తాలూకు అర్థవంతమైన తాత్వికతను తెలుగు ప్రేక్షకులకు కూడా చేరవేయడంలో దర్శకుడు సముద్రఖని సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.
+ ప్లస్ పాయింట్స్:
+ పవన్‌కల్యాణ్ పాత్రను తీర్చిదిద్దిన విధానం
+ పవన్‌కల్యాణ్, సాయితేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు
+ త్రివిక్రమ్ సంభాషణలు, ఉన్నతమైన నిర్మాణ విలువలు
– మైనస్ పాయింట్స్:
– మాతృకలోని సంఘర్షణ మిస్ కావడం