సినిమా : మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
తారాగణం: అనుష్క, నవీన్ పొలిశెట్టి , జయసుధ, నాజర్, మురళీశర్మ..
దర్శకత్వం: మహేశ్‌బాబు.పి.
నిర్మాతలు: వి.వంశీకృష్ణా, ప్రమోద్ ఉప్పలపాటి
నిర్మాణం: యూవీ క్రియేషన్స్
మూడేళ్ల విరామం తర్వాత అనుష్క (Anushka shetty) నటించిన సినిమా కావడం.. ‘జాతిరత్నాలు’ వంటి విజయం తర్వాత నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) చేసిన సినిమా కావడం.. నిర్మాణంలో రాజీ అంటూ తెలియని యూవీ క్రియేషన్స్‌వాళ్లు నిర్మించిన సినిమా కావడం.. ఈ కారణాలవల్ల ఈ సినిమాపై నిర్మాణంలోవున్నప్పట్నుంచీ అంచనాలు బావున్నాయ్. తొలి సినిమా ‘రారా కృష్ణయ్య..’ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో.. తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని మనసుపెట్టి తయారు చేసుకున్న కథ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ’ అని దర్శకుడు మహేశ్‌బాబు.పి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరి ఎట్టకేలకు ఈ గురువారం సినిమా విడుదలైంది. మరి ఎలావుందో చెప్పేముందు కథేంటో చూద్దాం..
కథ గురించి..
నాన్నకు దూరమై బాధపడుతున్న అమ్మతో కలిసి పెరిగిన కూతురు అన్విత. ఈ కారణం చేత తనకు పెళ్లిపై సదాభిప్రాయం ఉండదు. పెళ్లి చేయాలని తల్లి ఎంత ప్రయత్నించినా అన్విత మాత్రం ఒప్పుకోదు. ఓరోజు తనకు తల్లి కూడా దూరమవుతుంది. ఉన్న ఒక్క తోడు దూరమవ్వడంతో అన్విత ఒంటరి తనాన్ని భరించలేకపోతుంది. అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే, బయటనుంచి వచ్చే ఆ ప్రేమలో నిజం ఉంటుందో ఉండదో!? అనే భయం, అనుమానం. అందుకే అమ్మలేని లోటును అమ్మ అయ్యి తీర్చుకోవాలనుకుంటుంది. పెళ్లితో, శారీరక సంబంధంతో నిమిత్తం లేకుండా వైద్య సహాయంతో తల్లి కావాలని నిర్ణయించుకుంటుంది. తన నిర్ణయాన్ని గౌరవించి, సహకరించే వ్యక్తి కోసం వెతుకుతుంది. ఆ ప్రయత్నంతో తనకు స్టాండప్ కామెడీ చేసుకునే సిద్దూ తారసపడతాడు. విషయం చెప్పకుండా అతనితో స్నేహం చేస్తుంది. అతనేమో అన్వితను ప్రేమిస్తాడు. అన్వితకు కావాల్సింది కేవలం సిద్దూ స్పెరమ్. సిద్దూకి కావాల్సింది అన్విత. మరి తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
కథా విశ్లేషణ..
జీవితం ఒక్కసారి చేదుని రుచిచూపిస్తే.. ఇక ఎదురయ్యే ప్రతి అనుభవం చేదుగానే ఉంటుందేమోనని భ్రమించే ఓ అమ్మాయి కథ ఇది. వివాహబంధం పేరుతో బయటనుంచి వచ్చే ప్రేమను నమ్మలేక తనలో తానే ప్రేమను వెతుక్కోవాలని తాపత్రయపడే ఓ అమాయక కూతురు కథ ఇది.. మొత్తంగా ఇది అన్విత కథ. దర్శకుడు మహేశ్‌బాబు కాస్త లేటైనా మంచి కథతో వచ్చాడని చెప్పక తప్పదు.
నటీనటుల నటన..
ఈ సినిమా కథ పరంగా ప్రధాన పాత్ర అనుష్కది. ప్రధాన బలం మాత్రం నవీన్ పొలిశెట్టి. ఓ విధంగా అతనికిది టైలర్‌మేడ్ కేరక్టర్. దానికి తగ్గట్టే తనది స్టాండప్ కమెడియన్ పాత్ర కావడంతో సినిమా ఆద్యంతం నవ్విస్తూ అద్భుతంగా ఎంటర్‌టైన్ చేశాడు. ఒక్కసారి పరిచయమైతే వదులుకోలేని వ్యక్తులు కొందరుంటారు. అలాంటి వ్యక్తిగా కనిపిస్తాడు ఇందులో నవీన్ పోలిశెట్టి. అనుష్క తెరపై డిగ్నిఫైడ్‌గా, ఎప్పటిలాగే ఆందంగా కనిపించింది. ఆమెది ఎమోషన్స్‌తో కూడుకున్న పాత్ర. పాత్రోచితంగా చక్కగా నటించింది. సినిమా మొత్తాన్ని వీరిద్దరే భుజాలపై మోశారని చెప్పాలి. నవీన్ తండ్రిగా మురళీశర్మ కూడా బాగా మెరిశాడు.
టెక్నికల్‌గా..
సాంకేతికంగా కూడా సినిమా బావుంది. గోపీసుందర్ నేపథ్యసంగీతం, నిర్వాణ్‌షా ఛాయాగ్రహణం ఇలా అన్ని విభాగాలూ మనసుపెట్టి పనిచేశాయ్. ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా అభినందించాల్సింది దర్శకుడ్ని. తెరపై కనిపించే బంధాలన్నింటినీ అందంగా ఆవిష్కరించాడు. ఈ జనరేషన్‌కి తగ్గ మంచికథ ఇది. ప్రథమార్థం వినోదంతో అప్పుడే అయిపోయిందా? అనిపించింది. ద్వితీయార్థం మాత్రం కథ సీరియస్ మోడ్‌లో సాగడంచేత కాస్త నిదానించినట్లు అనిపిస్తుంది. మొత్తం సినిమా మాత్రం బావుంది. మంచి సినిమా. అందరూ చూడాల్సిన సినిమా.
ప్లస్ పాయింట్స్:
నవీన్ పోలీశెట్టి, అనుష్క నటన, కథ, కథనం, గోపీసుందర్ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్..
ద్వితీయార్థం కాస్త స్లో అవ్వడం..
రేటింగ్ : 3.25/5