నటీనటులు: సాయికుమార్,సదన్ హసన్, ప్రియాంక ప్రసాద్, పృథ్వీ, రాజమౌళి జబర్దస్త్, లాబ్ శరత్, సునీల్ రావినూతల  తదితరులు

ఎడిటర్: కొడగంటి వీక్షిత వేణు

సినిమాటోగ్రఫీ: ప్రసాద్ ఈదర

సంగీతం: మార్కండేయ

నిర్మాత: పారమళ్ల లింగయ్య

 

దర్శకత్వం: పీఎల్ విఘ్నేష్

 

విడుదల తేది: 13-12-2024

 

కథ విషయానికొస్తే..
గోదారికి చెందిన పెదకాపు (సాయి కుమార్) ఆ ఊరులో వెయ్యి ఎకరాల భూస్వామి. చుట్టు ఉన్న 40 గ్రామాలకు పెద్ద. ఆయన చెప్పిందే వేదం. అన్నకు ఇష్టం లేక లవ్ మ్యారేజ్ చేసుకున్న పెదకాపు చెల్లి.. భర్త కాలం చేయడంతో కుమారుడు శ్రీను (సదన్ హాసన్)తో కలిసి అన్నయ్య ఆశ్రయం కోరి వస్తుంది. అయితే.. తన కూతురు లలిత (ఉషశ్రీ)ని చెల్లి  కొడుకుకు ఇచ్చి మ్యారేజ్ చేయాలనుకుంటాడు పెదకాపు. కానీ శ్రీను మాత్రం మేనమామ కూతురు కాదని ఆ ఊర్లో జాలరి కూతురు గొయ్యి లక్ష్మి ప్రసన్న అలియాస్ గొయ్యని (ప్రియాంక ప్రసాద్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో తన కూతురును కాదని జాలరి అమ్మాయిని మేనల్లుడు ప్రేమిస్తున్నాడనే విషయం పెదకాపుకు తెలుస్తోంది. పరువు కోసం ప్రాణాలు సైతం తీసే పెదకాపు.. మేనల్లుడి ప్రేమ విషయం తెలిసి ఏం చేసాడు.  ఈ క్రమంలో ఏం జరిగింది. మరోవైపు మేనల్లుడు తన ప్రేమకు గెలిపించుకున్నాడ లేదా అనేద  ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
పరువు హత్యల నేపథ్యంలో తెలుగు సహా వివిధ భాషల్లో పలు చిత్రాలు తెరకెక్కాయి. ఈ కోవలో వచ్చిన మరో ప్రేమకథా చిత్రం ‘ప్రణయ గోదారి’. తెలుగులో పునర్జన్మల నేపథ్యంలో పలు ప్రేమకథా చిత్రాలు తెరకెక్కాయి. అందులో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ‘మూగ మనసులు’, బంగారు బొమ్మలు, జానకి రాముడు వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగులో మనం చూసిన ఇలాంటి కథాంశాన్ని మరలా ప్రేక్షకులు ఆకట్టుకునేలా తీయడం కత్తి మీద సామే. ప్రణయ గోదారి విషయంలో దర్శకుడు బాగానే డీల్ చేసినా.. అది కొంత వరకే బాగుంది. సినిమా రొటిన్ గా స్టార్ట్ అయినా.. ఆ తర్వాత అసలు కథలోకి ఎంటర్ కాగానే ఆసక్తి పెరుగుతోంది. తర్వాత సీన్స్ లో ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెంచడంలో  సఫలమయ్యాడు దర్శకుడు. మధ్యలో కొన్ని ల్యాగ్ సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. మధ్య మధ్యలో గోచి క్యారెక్టర్ చేసే కామేడి సీన్స్ నవ్వులు పూయిస్తాయి. సెకాండాఫ్ కథను పూర్తిగా ఎమోషనల్ గా తీసుకెళ్లాడు. ముఖ్యంగా మేనల్లుడుకి జాలరి అమ్మాయి మధ్య ప్రేమ ఉందని తెలుసుకొని.. ఆమెకు వేరే పెళ్లి చేయాలని చూడటం.. హీరో ఆ పెళ్లి అడ్డుకున్నాడా లేదా అనేది ఆడియన్స్ లో ఆసక్తి పెంచుతుంది. సినిమా క్లైమాక్స్ లో సాయి కుమార్ చెప్పే కొన్ని డైలాగులు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. స్క్రీన్ ప్లే ఇంకాస్త బలంగా రాసుకుంటే సినిమా వేరే లెవల్లో ఉండేది. సాయి కుమార్ తప్ప.. అంతా కొత్త నటీనటులు కావడం ఈ సినిమాకు కొంత మైనస్ గా మారిందనే చెప్పాలి. కొత్త వాళ్లయిన అంతా బాగా నటించారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సెకాండాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్మింగ్ చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువులు బాగున్నాయి. కెమెరామెన్ గోదారి అందాలను తన కెమెరాలో బంధించాడు. ఆనాటి కాలానికి తీసుకెళ్లాడు.

 

నటీనటుల విషయానికొస్తే..
ప్రణయ గోదారి సినిమాలో మరోసారి సాయికుమార్ నటుడిగా తన విశ్వరూపం చూపించాడు. ఆయనలోని విలనిజాన్ని మన తెలుగు దర్శకులు వాడుకోవడ లేదనే చెప్పాలి. మరోసారి ప్రతినాయకుడి పాత్రలో ఇరగదీసాడు. హీరోగా నటించిన సదన్ హసన్ నటన బాగుంది. హీరోయిన్ గా నటించిన ప్రియాంక ప్రసాద్ విలేజ్ గర్ల్ పాత్రలో ఆకట్టుకుంది. మరోవైపు గోచి పాత్రలో నటించిన సునీల్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

 

పంచ్ లైన్..ప్రేమికులను ఆకట్టుకునే ‘ప్రణయ గోదారి’..

 

రేటింగ్..3/5