చిత్రం: ది గర్ల్‌ఫ్రెండ్‌; నటీనటులు: రష్మిక, దీక్షిత్‌ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్‌, రావు రమేశ్‌, రోహిణి తదితరులు

ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో ప్ర‌ధాన‌మైనది ‘ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌’. అగ్ర తార ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా నటించడం.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నుంచి వ‌స్తుండ‌డం… మంచి ప్ర‌చారం కూడా దక్క‌డంతో అంద‌రి దృష్టీ ‘ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌’పై ప‌డింది. మ‌రి ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?

సినిమా క‌థేంటంటే…

భూమా దేవి అలియాస్ భూమా (ర‌ష్మిక మంద‌న్న‌), విక్ర‌మ్ (దీక్షిత్ శెట్టి) పీజీ విద్యార్థులు. ఒకే క‌ళాశాల‌లో వేర్వేరు కోర్సుల్లో చేరుతారు. తొలి ప‌రిచ‌యంలోనే ఒక‌రికొక‌రు న‌చ్చేస్తారు. ఆ వెంట‌నే గ‌ర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్ అయిపోతారు. విక్ర‌మ్‌ని దుర్గ (అను ఇమ్మానుయేల్‌) కూడా ఇష్ట‌ప‌డుతుంది. కానీ, విక్ర‌మ్ మాత్రం భూమా త‌న‌ని అమ్మ‌లా చూసుకునే అమ్మాయని ఆమెనే ప్రేమిస్తాడు. ఆ మాటే విక్ర‌మ్‌పైన భూమాకి మ‌రింత ప్రేమ‌ని పెంచుతుంది. అలా చ‌దువుకుంటూనే ప్రేమ‌ప్ర‌యాణం చేసిన ఆ ఇద్ద‌రూ ఒక‌రి గురించి మ‌రొక‌రు మ‌రింత లోతుగా తెలుసుకున్న‌ప్పుడు ఎలాంటి సంఘర్ష‌ణ ఏర్ప‌డింది?ఆ ప్ర‌యాణానికి ఒక విరామం కావాల‌ని భూమా ఎందుకు అడ‌గాల్సి వ‌చ్చింది?అస‌లు ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌బంధం నిలిచిందా? లేదా?త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే…

హీరో హీరోయిన్లు ఎప్పుడెప్పుడు ఒక్క‌ట‌వుతారా? అనే ఆస‌క్తిని రేకెత్తించే ప్రేమ‌క‌థ‌లే ఎక్కువ‌. త‌మ ప్రేమ‌కు ఎదురైన అడ్డంకుల్ని దాటుకుని ఇద్ద‌రూ ఒక్క‌ట‌వ్వ‌గానే క‌థ సుఖాంత‌మైంద‌నే ఆనందంతో చ‌ప్ప‌ట్లు కొట్టి బ‌య‌టికొచ్చేస్తుంటాం. ఇందులో మాత్రం హీరోయిన్ త‌న ప్రేమ‌కు బ్రేక‌ప్ చెప్ప‌గానే థియేట‌ర్ చ‌ప్ప‌ట్లతో మార్మోగిపోతుంది. దీన్ని బ‌ట్టి ఇది ఎలాంటి ప్రేమ‌క‌థో అర్థం చేసుకోవ‌చ్చు. అప‌రిప‌క్వ ప్రేమ‌లు, విష‌పూరిత‌మైన బంధాల్ని తెర‌పైన ఆలోచ‌న రేకెత్తించేలా ఆవిష్క‌రించి, నేటి స‌మాజానికి ఎంతో అవ‌స‌ర‌మైన కథ‌ని చెప్పాడు ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌ బంధాల విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా నిర్ణ‌యాలు తీసుకోవాలో చెప్ప‌క‌నే చెబుతుందీ చిత్రం. అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికి ముందు కొన్ని చ‌ప్ప‌గా సాగే స‌న్నివేశాలు ఇబ్బంది పెట్టినా… హీరో హీరోయిన్ల ప్రేమ ప్ర‌యాణం మొద‌ల‌వ్వ‌గానే సినిమాలో లీన‌మైపోతాం. ఆరంభంలో భూమా, విక్ర‌మ్‌ల ప‌రిచ‌య స‌న్నివేశాలు… మాస్ హీరో ప్రేమ‌లో ప‌డిన ఓ అంద‌మైన హీరోయిన్ క‌థ‌లాగే అనిపిస్తుంది. ఆ త‌ర్వాత హీరో పాత్ర న‌డ‌వ‌డిక ఈ క‌థ‌ని మరో దిశ‌గా మ‌లుపు తిప్పుతుంది.

ప్రేమ పేరుతో ఒకొక్కటిగా ఏర్ప‌డే బంధాలు, వాటితో క‌థానాయిక ఉక్కిరిబిక్కిర‌య్యే తీరు అస‌లు సిస‌లు డ్రామాని పండిస్తుంది. ఆ స‌న్నివేశాలు సాగుతున్న‌కొద్దీ క‌థానాయిక పాత్ర‌పై జాలి క‌లుగుతుంది. దాంతో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత‌గా క‌నెక్ట్ అవుతుందీ చిత్రం. స్టేజీపైన నాట‌కం త‌ర్వాత వచ్చే స‌న్నివేశాలు, హీరో త‌న ఇంటికి తీసుకెళ్లి త‌ల్లిని ప‌రిచ‌యం చేసే క్రమమే క‌థ‌లోని అస‌ల విరామ స‌న్నివేశాల్ని మ‌లిచిన తీరు, అక్క‌డ హీరోయిన్‌ని చూపించిన విధానం చాలా బాగుంది. ద్వితీయార్ధం మొద‌ల‌య్యాక హీరోయిన్ తండ్రి నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు మిన‌హా సినిమా చాలావ‌రకూ ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతుంది. ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి హైలైట్‌. వేదిక అంటే భ‌య‌ప‌డే అమ్మాయిగా ప‌రిచ‌య‌మైన క‌థానాయిక‌… చివ‌రికి అదే వేదికపైకి ఎక్కి ఒక విస్ఫోట‌నాన్ని గుర్తు చేస్తుంది. క‌థానాయిక పాత్ర అత్యుత్త‌మ నిర్మాణానికి అద్దం పడ‌తాయి ఆ స‌న్నివేశాలు. ష‌ర‌తులు లేని ప్రేమే జీవితాన్ని, అందులోని అందాన్ని స‌జీవంగా నిలుపుతుంద‌ని ఈ క‌థ‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌. ఆయ‌న భార్య‌, ప్ర‌ముఖ గాయ‌ని చిన్మ‌యి సామాజిక మాధ్య‌మాల్లో ఇలాంటి అంశాల్నే త‌ర‌చూ ప్ర‌స్తావిస్తూ చ‌ర్చ‌ని లేవ‌నెత్తుతుంటారు.

ఎవ‌రెలా చేశారంటే..

భూమా పాత్ర‌కి ప్రాణం పోశారు క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న ఆమె ఒకే ఫ్రేమ్‌లో, క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే భిన్న భావోద్వేగాలు ప‌లికించిన సంద‌ర్భాలు ఇందులో చాలానే ఉన్నాయి. వాటిని ద‌ర్శ‌కుడు తెర‌పై ఆవిష్క‌రించిన తీరు ఎంత బాగుందో, అందులో ర‌ష్మిక న‌ట‌న అంత గొప్ప‌గా ఉంది. ఆమె పండించే భావోద్వేగాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. దీక్షిత్ శెట్టి న‌ట‌న గుర్తుండిపోతుంది. ప్ర‌థ‌మార్ధంలో స్టైలిష్‌గా క‌నిపించాడు. ద్వితీయార్ధంలో ప్రేక్ష‌కుల‌కు ద్వేషం క‌లిగేంత‌గా త‌న పాత్ర‌పై ప్ర‌భావం చూపించాడు. అను ఇమ్మానుయేల్ అంద‌మైన పాత్ర‌లో సంద‌డి చేస్తుంది. రావు ర‌మేశ్ తండ్రి పాత్రలో అల‌వోక‌గా న‌టించారు. రోహిణి పాత్ర ఈ సినిమాకి కీలకం. ఆమె క‌నిపించేది కొన్ని స‌న్నివేశాల్లోనే అయినా మొత్తం క‌థ‌పై ప్ర‌భావం చూపించారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ లెక్చ‌ర‌ర్‌గా క‌నిపిస్తారు. న‌టుడిగా కంటే ఆయ‌నకు ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగానే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. క‌థాంశంలో బ‌లం ఉన్న‌ప్ప‌టికీ, సినిమాకి త‌గ్గ హంగులు ఇందులో లేవు. అయినా స‌రే, విజువ‌ల్స్‌, న‌టీన‌టులు బ‌ల‌మైన అభిన‌యాల‌తోనూ ఎంతో ప్ర‌భావం చూపించేలా ఈ క‌థ‌ని చెప్పారు. సాంకేతిక విభాగాల‌న్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. హేష‌మ్ స్వ‌ర‌క‌ల్ప‌న‌లోని పాట‌లు క‌థ‌లో భాగమైపోయాయి. ప్ర‌శాంత్ ఆర్‌.విహారి నేప‌థ్య సంగీతం మెప్పిస్తుంది. కృష్ణ‌న్ వ‌సంత్ విజువ‌ల్స్ , రాకేందు మౌళి సాహిత్యం, చోటా కె ప్ర‌సాద్ కూర్పు ఇలా అన్ని విభాగాలూ మెరిశాయి. నిర్మాణంలో లోటుపాట్లేమీ క‌నిపించ‌వు.

బ‌లాలు
క‌థాంశం
ర‌ష్మిక.. దీక్షిత్ న‌ట‌న
భావోద్వేగాలు

బ‌ల‌హీన‌త‌లు

ఊహ‌కందేలా క‌థ‌నం

చివ‌రిగా: ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌…నిలిచిపోతుంది

సినిమిర్చి రేటింగ్ :3/5