నటీనటులు: చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్థన్, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు, చలపతిరావు, తడివేలు, బాలరాజ్, లక్ష్మీకిరణ్, శేఖర్, వీరభద్రం, శ్రీకుమారి, మురళీకృష్ణ, వాణిశ్రీ, బిందు, సరస్వతి, జగపతి తదితరులు
సంగీతం: ఆనంద బాలాజీ
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: వినోద్ యాజమాన్య
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్
ఎడిటింగ్: ఎస్.కె.చలం
మాటలు: సాయికృష్ణ వెలిశెట్టి, పన్నా రాయల్
నిర్మాత-దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్
బ్యానర్: డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్
దర్శకత్వం: కె.సంతోష్‌బాబు.
విడుదల తేదీ: 05.01.2024
కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ చిత్రాలతో దర్శకుడుగా తనను తాను ప్రూవ్ చేసుకున్న పన్నా రాయల్ నిర్మాతగా మారి డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ పతాకంపై కె.సంతోష్‌బాబును దర్శకుడుగా పరిచయం చేస్తూ నిర్మించిన సైంటిఫిక్ కామెడీ మూవీ ‘ప్లాంట్ మ్యాన్’. ఈ చిత్రానికి పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చెయ్యాలన్న ఉద్దేశంతో పన్నా రాయల్ నిర్మించిన ఈ సినిమా ఎంతమేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? ఈ సైంటిఫిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ద్వారా ఎలాంటి సందేశాన్ని అందించారు? ఆడియన్స్‌కి ఈ సినిమా ఎంతవరకు రీచ్ అయింది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
చారి(చందు) పెద్ద చదువులు చదివి పాతిక లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినప్పటికీ దాన్ని వదిలేసి తనకెంతో ఇష్టమైన ఆర్గానిక్ వెజిటబుల్స్ బిజినెస్ రన్ చేస్తుంటాడు. అతనికి పెళ్లి చెయ్యాలని అతని తల్లిదండ్రులు ఎంత ప్రయత్నం చేసినా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటాడు. మరో పక్క చందు(సోనాలి)కి పెళ్లి చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆమె చిన్ననాటి స్నేహితుడు చింటు(అక్కం బాలరాజు) చందుని ప్రేమిస్తుంటాడు. అందుకే ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతుంటాడు. మొత్తానికి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడంతో చందుని చూసుకునేందుకు వస్తారు చారి, అతని తలిదండ్రులు. అబ్బాయి, అమ్మాయి ఇష్టపడడంతో వారికి పెళ్లి చేసేందుకు పెద్దవాళ్ళు సిద్ధమవుతారు. ఇది నచ్చని చింటూ.. చారిపై పగ పెంచుకుంటాడు. ఎలాగైనా ఈ పెళ్లి చెడగొట్టాలని ట్రై చేస్తాడు. కానీ, అతని ప్రయత్నాలు ఫలించవు. చారికి, చందుకి పెళ్లి జరిగిపోతుంది. ఈలోగా చారి జీవితంలో ఓ అనుకోని సంఘటన జరుగుతుంది. చింటూ తండ్రి ఓ సైంటిస్ట్ ఎడారిలో సైతం మొక్కలు మొలిపించేందుకు 30 ఏళ్లుగా పరిశోధనలు చేస్తుంటాడు. ఓరోజు అతని పరిశోధన విజయవంతమై ఓ మందు కనుగొంటాడు. ఆ మందు నేల మీద జల్లితే నిమిషాల్లో మొక్కలు పుట్టుకొస్తాయి. అది తెలుసుకున్న చింటూ ఆ మందును చారి మీద ప్రయోగిస్తాడు. దాంతో చారికి ఒళ్ళంతా మొక్కలు వచ్చేస్తాయి. ఈలోగ చారి, చందులకు శోభనం ఏర్పాటు చేస్తారు. ఆ పరిస్థితిలో చారి శోభనం తప్పించుకోవడానికి ఏం చేశాడు? ఒంటి నిండా వచ్చిన మొక్కలతో అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి అతను ఆ సమస్య నుంచి ఎలా బయటపడి మామూలు మనిషిగా మారాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ :
ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని ఓ కొత్త పాయింట్‌తోనే ఈ సినిమా రూపొందింది. దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌పైనే తన దృష్టంతా పెట్టాడు దర్శకుడు. హీరో బ్యాచ్‌తోనే కాదు, మిగతా క్యారెక్టర్లతో కూడా మంచి కామెడీ చేయించగలిగాడు. ముఖ్యంగా సినిమాలోని చాలా పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. మామూలు మనిషి నుంచి ప్లాంట్ మ్యాన్‌గా మారడం, ఆ ప్రాసెస్‌లో జరిగే ఇన్సిడెంట్స్‌ని ఎంతో ఫన్నీగా చూపించారు. ఈ సినిమాలో అంతర్లీనంగా మొక్కలు అనేవి మానవ జీవితానికి ఎంతో అవసరం అనే సందేశం కూడా ఉంది. ప్రతి సన్నివేశం అందరూ నవ్వుకునేలా తియ్యడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
నటీనటులు :
హీరోగా నటించిన చందుకి, హీరోయిన్‌గా నటించిన సోనాలికి ఇది మొదటి సినిమాయే అయినా ఎక్కడా తడబాటు లేకుండా చక్కగా నటించారు. కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో కూడా తమ నటనతో మంచి మార్కులు తెచ్చుకున్నారు. హీరో ఫ్రెండ్‌గా నటించిన అశోక్‌వర్థన్ వేసిన పంచ్‌లు బాగా పేలాయి. అతను తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ ప్రేక్షిత రాయలసీమ యాసలో చెప్పిన డైలాగ్స్ అందర్నీ నవ్వించాయి. ఇక యూట్యూబ్‌లో ఎంతో పాపులర్ అయిన అక్కం బాలరాజు కూడా తనదైన శైలిలో హాస్యాన్ని పండిరచాడు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన నటీనటులు కూడా వారి పరిధి మేరకు బాగానే చేశారు.
సాంకేతిక నిపుణులు :
ఈ సినిమాకి హైలైట్స్‌గా సినిమాటోగ్రఫీ, సంగీతం నిలుస్తాయి. మణికర్ణన్ అందించిన ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ఆనంద బాలాజీ చేసిన రెండు పాటలు కూడా మెలోడియస్‌గా వినసొంపుగా ఉన్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను వినోద్ యాజమన్య ఎంతో అద్భుతంగా చేశారు. నిర్మాత పన్నా రాయల్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. సినిమాకి అవసరమైన మేర బడ్జెట్ పెట్టి ఉన్నంతలో రిచ్‌గా నిర్మించారు. ఇక దర్శకుడు సంతోష్‌బాబు గురించి చెప్పాలంటే.. ఒక కొత్త పాయింట్‌ని తీసుకొని దానికి హాస్యాన్ని జోడిరచి రెండు గంటలపాటు ప్రేక్షకుల్ని సీట్స్‌లో కూర్చోబెట్టగలిగాడు. ఫైనల్‌గా చెప్పాలంటే హద్దు మీరని హాస్యంతో కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసే విధంగా ‘ప్లాంట్ మ్యాన్’ చిత్రాన్ని రూపొందించారు.
Movie rating 2.75/5