“ముచ్చటగా మూడోసారి కూడా భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం” అనే అంచనాల నడుమ నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. “విశ్వనేత” పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి యువ ప్రతిభాశాలి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ‘వందే మీడియా ప్రయివేట్ లిమిటెడ్’ పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించనున్నారు!!

ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ కు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జి.ఎస్.టి, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సంచలనాలతో కోట్లాది భారతీయుల గుండెల్లో కొలువుదీరి.. “యూనిఫామ్ సివిల్ కోడ్” అమలు దిశగా అడుగులు వేస్తున్న నరేంద్రుడి బయోపిక్ లో చాయ్ వాలా స్థాయి నుంచి “విశ్వనేత” గా ఎదిగిన ఆయన మహాప్రస్థానానికి దృశ్యరూపం ఇవ్వనున్నామని సినిమా యూనిట్ చెబుతోంది!!